జాతీయ వార్తలు

Arunachal Pradesh: Eight BJP MLAs, including two ministers, switch to National People’s Party

అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి భారీ షాక్

ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఒకేసారి ఇద్దరు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడి నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలో చేరారు. 60 అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ప్రదేశ్‌ను ప్రేమ్ ఖండు నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభతోపాటు..అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. వివిధ రకాల ఆరోపణలు, గెలిచే అవకాశాలులేని సిట్టింగ్‌లను బీజేపీ అధిష్ఠానం పక్కనపెట్టింది. దీంతో వీరందరు మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్‌పీపీ తీర్థం పుచ్చుకుని బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.

మరింత +
Transgender Bharati Kannamma files nomination papers from Madhurai Lok Sabha seat

మధురై నుంచి పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ భారతీ

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల బరిలో ఓ ట్రాన్స్‌జెండర్ దిగింది. తమిళనాడులోని మధురై పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు ట్రాన్స్‌జెండర్ భారతీ కన్నమ్మ తెలిపింది. మధురై కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి ట్రాన్స్‌జెండర్ భారతీ కన్నమ్మ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. తోటి ట్రాన్స్‌జెండర్లతో ఊరేగింపుగా వెళ్లి భారతి తన నామినేషన్ వేసింది. మధురై పార్లమెంటు స్థానం నుంచి ట్రాన్స్‌జెండర్ ఎన్నికల బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

మరింత +
Goa: New CM Pramod Sawant’s coalition government to face floor test in Assembly today

బలపరీక్షలో నెగ్గిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ఇవాళ జరిగిన బలపరీక్షలో విజయం సాధించారు. మనోహర్ పారికర్ వారసుడిగా గోవా సీఎం పీఠాన్ని అధిరోహించిన ఆయన తనకు సంపూర్ణ మద్దతు ఉందని నిరూపించారు. 

ప్రస్తుత లెక్కల ప్రకారం బీజేపీకి సొంతంగా మెజార్టీ లేకపోయినా మిత్ర పక్షాల మద్దతుతో అధికారాన్ని కొనసాగించేందుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ముందుగానే మిత్రపక్షాలతో బీజేపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎంజీపీ, జీఎఫ్‌పీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. బీజేపీకి మద్దతిస్తున్న జీఎఫ్‌పీకి చెందిన విజయ్‌సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్‌ ధవలికర్‌లకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకుంది. అందువల్ల బల నిరూపణలో బీజేపీ నెగ్గే అవకాశాలున్నాయి.  

గోవా అసెంబ్లీలో సీట్ల సంఖ్య 40 కాగా, మనోహర్ పారికర్ మరణానికి ముందు 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మనోహర్ మరణంతో ఖాళీ స్థానాల సంఖ్య 4కు చేరింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజా గత నెల్లో చనిపోయారు. అంతకుముందు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే ప్రస్తుతం గోవా అసెంబ్లీలో స్థానాల సంఖ్య 36కు చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ కనీసం 19 స్థానాల్లో మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది.

మరింత +
BJP Leader Pramod Sawant sworn in as Goa Chief Minister

గోవా 13వ సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

గోవా 13వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, ప్రస్తుత స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ అర్థరాత్రి 1 గంట 51 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధినేత విజయ్‌ సర్దేశాయ్‌, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్‌కు ఉపముఖ్యమంత్రి పదవులు దక్కాయి. పారికర్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న 11 మంది సావంత్‌తో పాటు మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ మృదులా సిన్హా రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. 

 పారికర్‌ వారసుడిని ఎంపిక చేసే విషయంలో మిత్రపక్షాల మధ్య విస్తృతస్థాయిలో చర్చలు సాగాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఉదయమే గోవాకు చేరుకుని నేతలతో మంతనాలు జరిపారు. మిత్రపక్షాల్ని ఏకతాటిపైకి తెచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం దిశగా ప్రయత్నించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా మిత్రపక్ష ఎమ్మెల్యేలతో ఓ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏకాభిప్రాయంతో సీఎం పదవికి అభ్యర్థిని ఎంపిక చేద్దామని ఆయన ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి పదవికి తొలుత ఆరోగ్యమంత్రి విశ్వజిత్ రాణే పేరు పరిశీలనలోకి వచ్చినా చివరికి ప్రమోద్‌ సావంత్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.

మరింత +
Anil Ambani thanks elder brother Mukesh Ambani for paying Ericsson dues

ఆర్‌కామ్-ఎరిక్సన్ డీల్: తమ్మున్ని కాపాడిన అన్న

ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా కొద్దిలో తప్పించుకున్నారు. అప్పుల్లో కూరుకు పోయి జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడంతో అన్న ముకేష్ అంబానీ ఆయన్ను రక్షించాడు. స్వీడన్ సర్వీస్ ప్రొవైడర్ ఎరిక్సన్‌కు 550 కోట్ల బకాయిలు చెల్లించడానికి ఒక్క రోజులో గడువు ముగుస్తుందనగా ముకేష్ ఈ మొత్తాన్ని చెల్లించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న అనిల్ తన అన్నావదినలకు థ్యాంక్స్ చెప్పారు. కుటుంబ విలువలే ముఖ్యమని, తనను సమయానికి ఆదుకున్నారని ఆయన ముకేశ్ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లించామని ఆర్‌కామ్ వెల్లడించింది.  

రిలయన్స్ కమ్యూనికేషన్స్ నష్టాల బాట నడుస్తుండటంతో అనిల్ అంబానీ తన సంస్థ బాధ్యతను స్వీడిష్ కంపెనీ ఎరిక్‌సన్‌కు బాధ్యతలు అప్పగించాడు. ఆర్‌కామ్ నెట్‌వర్క్‌ను ఆపరేట్ చేయడానికి ఎరిక్‌సన్ సంస్థ అనిల్ అంబానితో 2014లో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ సేవలకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని గత ఏడాది ఎరిక్‌సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అనిల్ అంబానీని దోషిగా తేల్చిన న్యాయస్థానం ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లించేందుకు నాలుగు వారాల గడువు విధించింది. డబ్బులు చెల్లించకలేకపోతే మూడు నెలల జైలు శిక్ష విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో గత ఫిబ్రవరిలోనే ఆర్‌కామ్ సంస్థ సుప్రీంకోర్టు వద్ద 118 కోట్ల రూపాయలను జమ చేసింది. మిగిలిన బకాయిలు చెల్లించడానికి గడువు ఇవాల్టీతో ముగియనుండటంతో అంతకు ఒక ముందు ఈ మెత్తాన్ని ముఖేష్ అంబానీ చెల్లించారు. దీంతో ఆర్‌కామ్, ఎరిక్‌సన్‌ మధ్య 18 నెలల వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.

మరింత +
Priyanka Gandhi addresses a rally in Prayagraj

ఈ దేశాన్ని కాపాడాలని ప్రియాంక గాంధీ పిలుపు

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ. బీజేపీ ప్రభుత్వం కొంతమంది కోసమే పని చేస్తోందని ఆమె విమర్శించారు. బడా వ్యాపారులకు ప్రభుత్వం వేల కోట్లు మేలు చేస్తూ రైతులను పట్టించుకోవడం లేదనీ ప్రియాంక ఆరోపించారు. దేశం ప్రమాదంలో ఉందనీ ఓటు హక్కును జాగ్రత్తగా ఉపయోగించుకొని దేశాన్ని కాపాడాలని ప్రియాంక పిలుపునిచ్చారు.

మరింత +
General elections 2019: Sumalatha Ambareesh to contest as independent from Mandya

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న సుమలత

ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నానని సుమలత అంబరీష్ తెలిపారు. కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ నుంచి బరిలోకి దిగనున్నట్లగా ఆమె వెల్లడించారు. అంబరీష్ మండ్య జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించారని అదే జిల్లా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలనుకున్నానని చెప్పారు. దశాబ్దాల కాలంగా అంబరీశ్‌ పలు పదవులలో ఉన్నప్పుడు రాజకీయంగా తనకు అనుభవం ఉందని అయితే బహిరంగంగా రాజకీయాలు చేయలేదని సుమలత తెలిపారు.

మరింత +
Priyanka Gandhi Kicks Off UP Poll Campaign With 3-day Ganga Yatra to Varanasi

ప్రియాంక గాంధీ గంగా ప్రచారయాత్ర ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ప్రయాగరాజ్ టు వారణాసి 140 కిలోమీటర్ల మేర గంగా ప్రచార యాత్ర చేపట్టారు. బస్సు, రైలు, పాదయాత్రలే కాకుండా నదిలో యాత్ర చేపట్టిన ప్రియాంకగాంధీ వినూత్న ప్రచారం చేస్తున్నారు. పవిత్ర గంగా నదిలో బోటులో ప్రయాణిస్తూ నదీ తీర గ్రామాల్లో ప్రియాంక ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 140 కిలోమీటర్ల దూరం నదిలో ప్రియాంక పర్యటనలో కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. యూపీలో ప్రియాంక చేపట్టిన గంగా ప్రచారయాత్ర చర్చనీయాంశంగా మారింది.

మరింత +
Lok Sabha Election 2019: EC to issue notification for phase 1 Today

ఇవాళ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడుతలో జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ తొలి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ విడతలో ఏపీ అసెంబ్లీతో పాటు 25 ఎంపీ, తెలంగాణలో 17 సహా మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తిచేశామని ఈసీ అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలు, ఆ తర్వాత పాటించాల్సిన నిబంధనల గురించి అన్ని పార్టీలు, అభ్యర్థులకు ఇప్పటికే అవగాహన కల్పించినట్టు తెలియజేశారు.  

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మొత్తం 42 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహించున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కాసేపట్లో వెల్లడి కానుంది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 26న నామినేషన్ల పరిశీలన చేయనుండగా 28 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్‌ 11న తొలి దశ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మిగిలిన దశలోను ఎన్నికలు జరిగిన తరువాత ఫలితాలను మాత్రం మే 23న ప్రకటిస్తారు. మొత్తం 20 రాష్ట్రాల్లో మొదట దశ 91 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు.  

తొలి విడతలో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్ధానాలకు, తెలంగాణ 17, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2, అస్సాంలో 5, బీహార్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు చత్తీస్‌గఢ్‌లో 1 స్థానం, జమ్మూ కాశ్మీర్‌లో 2, మహారాష్ట్రలో 7, మనిపూర్‌లో 1, మేఘాలయలో 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక మిజోరంలో 1, నాగాలాండ్‌లో 1, ఒడిషాలో4, సిక్కిం 1, త్రిపుర 1, ఉత్తరప్రదేశ్‌ 8, ఉత్తరాఖండ్‌ 5, పశ్చిమ బెంగాల్‌ 2, అండమాన్‌, లక్షద్వీప్‌ 1 నియోజక వర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి.

మరింత +
Life History of Goa CM Manohar Parikar, He is no more after battle with cancer

మనోహర్ పారికర్ జీవిత ప్రస్థానం

భారతదేశ రాజకీయాల్లో పారికర్‌ది ప్రత్యేక స్థానం. గోవా సీఎంగా, దేశ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రభుత్వ విధానాలను విమర్శించేవారేగానీ ఆయన వైఖరిని తప్పుబట్టేవారు కాదు. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు నిర్వహించి బీజేపీని రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేశారు. 2014లో ఎన్డీయే కేంద్రంలో అధికారంలో రావడంతో ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కేంద్ర రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలంలో భద్రతాదళాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆయుధసేకరణలో పారదర్శక విధానాలు అవలంభించారు. గోవా లాంటి చిన్న రాష్ట్రానికి చెందిన వారు అయినప్పటికీ కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారంటే ఆయనకున్న ప్రాధాన్యం తెలుస్తోంది.  

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ వ్యక్తిగా ముద్రపడ్డ పారీకర్ పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్‌ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల స్థాయిలోనే ఆరెస్సెస్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై సంఘ్‌లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఓవైపు సొంతవ్యాపారం చేసుకుంటూనే ఉత్తరగోవాలో ఆరెస్సెస్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990ల్లో రామజన్మభూమి ఉద్యమంపై పారీకర్‌ గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పారీకర్‌ సమర్థత, చురుకుదనం గమనించిన ఆరెస్సెస్, బీజేపీ పెద్దలు గోవాలో వేళ్లూనుకుంటున్న మహా రాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీకి చెక్‌ పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఐఐటీలో చదువుకున్న తొలిసీఎంగా పరీకర్‌ ఖ్యాతి గడించారు.  

గోవా సీఎంగా 2000లో బాధ్యతలు చేపట్టిన పారీకర్‌ రాష్ట్రాన్ని బీజేపీకి కంచుకోటగా మార్చారు. ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్నప్పటికీ ఆధునికవాదిగా, అందరినీ కలుపుకుని ముందుకెళ్లే నేతగా ఆయన గుర్తింపు పొందారు. ప్రధాని మోడీ కేబినెట్‌లో రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హవాయి చెప్పులు, నలిగిన చొక్కాతో సామాన్యుడిలా డీ–బ్లాక్‌కు రావడం ఆయనకే చెల్లింది. పారీకర్‌ సీఎంగా ఉంటేనే బీజేపీకి మద్దతు ఇస్తామని మహారాష్టవాదీ గోమంతక్‌ పార్టీ, గోవా ఫార్వర్డ్‌ పార్టీతో పాటు స్వతంత్రులు చెప్పడం పారీకర్‌ పనీతీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికార ఆర్భాటం లేకుండా విమానాశ్రయానికి ఆటోలో రావడం, తన లగేజ్‌ తానే తీసుకురావడం వంటి నిరాడంబర జీవనశైలితో పారీకర్‌ ఆదర్శంగా నిలిచారు. 2013లో గోవాలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సదస్సుకు ముందు పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును పారీకరే ప్రతిపాదించారు.  

గోవాలో సంఘ్‌తో పాటు క్రైస్తవ ప్రభావం ఎక్కువగా ఉంది.రెండు వర్గాలను కలుపుకోవడంలో పారికర్‌ సఫలీకృతుడయ్యారు. 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఇప్పటి వరకు పారికర్‌ గోవా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. గోవాలో ప్రభుత్వాలు స్థిరంగా ఉండేవికావు. 1990-2002 మధ్య కాలంలో 13 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన పారికర్‌ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రంగా మారారు. ముక్కుసూటితనం, నిజాయితీ, నిరాడంబరతలతో గోవా ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. 2017లో జరిగిన రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ రాలేదు. మొత్తం 40 సీట్లలో 17 సీట్లు సాధించి అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచింది. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకు చికిత్స తీసుకుంటూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించారు.  

బీజేపీకి కంచుకోటగా గోవా పారీకర్‌ రాజకీయ అరంగేట్రం అంత గొప్పగా ఏమీ జరగలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 1991లో తొలిసారి పోటీచేసిన పారీకర్‌ ఓటమి చవిచూశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పణజి నుంచి విజయం సాధించారు. పారీకర్‌ నాయకత్వంలో బీజేపీ గోవాలో బలీయమైన శక్తిగా ఎదిగింది. 2000లో గోవా పీపుల్స్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పారీకర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లీటర్‌ పెట్రోల్‌ ధరను 11కు తగ్గించడం, మహిళలకు ఆదాయాన్ని కల్పించడం సహా పలు సంక్షేమ పథకాలతో పారీకర్‌ ఇమేజ్‌ గోవాలో అమాంతం పెరిగిపోయింది. దీంతో 2012 గోవా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.  

ఢిల్లీ నుంచి పిలుపు 2014లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న ’వన్‌ ర్యాంక్‌–వన్‌ పెన్షన్‌’ విధానం పారీకర్‌ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 17 స్థానాలు రాగా, బీజేపీకి కేవలం 13 సీట్లు మాత్రమే దక్కాయి. వెంటనే రంగంలోకి దిగిన పారీకర్‌ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చలు జరిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పారీకర్‌ భార్య మేధా కేన్సర్‌తో 2000లో కన్నుమూశారు. పారీకర్‌ దంపతులకు ఉత్పల్, అభిజిత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.  

2016లో పారీకర్‌ రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఫ్రాన్స్‌తో 58 వేల కోట్లతో 36 రఫేల్‌ ఫైటర్‌జెట్ల కొనుగోలుకు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసింది. దీంతో కాంగ్రెస్‌ కేంద్రంపై విమర్శల దాడిని పెంచింది. రక్షణశాఖతో పాటు ప్రధాని కార్యాలయం కూడా రఫేల్‌ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందనీ, దీన్ని రక్షణశాఖ వ్యతిరేకించిందన్న ఓ నోట్‌ను ఉటంకిస్తూ ‘హిందూ’ పత్రికలో కథనం రావడంతో కలకలం చెలరేగింది. పారీకర్‌ బెడ్రూమ్‌లో రఫేల్‌ ఫైళ్లు ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్‌ రాణే మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులను కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో పారీకర్‌ స్పందిస్తూ.. నిజాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నిస్తోందని మండిపడ్డారు.  

2018, ఏప్రిల్‌లో పారీకర్‌ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్‌ కేన్సర్‌ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పారీకర్‌ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్‌లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం పారీకర్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో గోవా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పారీకర్, అనారోగ్యం కారణంగా చాలావరకూ తన ప్రైవేటు నివాసానికే పరిమితమయ్యారు. గత రెండ్రోజులుగా పారీకర్‌ ఆరోగ్యం విషమించడంతో వైద్యులు లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ను ఆయనకు అమర్చి చికిత్స అందజేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

మరింత +
BJP Central Election Committee to meet in New Delhi today

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆ పార్టీ అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గోనున్నారు. ఏప్రిల్ 11న మొదట విడత పోలింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 42 స్థానాలకు జరుగనున్న ఎన్నికలపై ఈ సమావేశంలో సమీక్షిస్తారు. ఇప్పటికే తెలంగాణ అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. యూపీ, బీహార్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోంలోని పలు నియోజకవర్గాలు కూడా మొదటి విడత పోలింగ్‌లో ఉన్నాయి. వీటిపై కూడా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమీక్షించనుంది.

మరింత +
Supreme Court issues notice in plea filed by 21 opposition leaders for VVPAT verification

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ యంత్రాల స్లిప్పులు సరిపోల్చి చూడాలని బీజేపీయేతర పార్టీలు పిటిషన్ వేశాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తరపున ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరింత +
6 Killed, 30 Injured In Mumbai Footbridge Crash

ముంబై రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలి 6గురు మృతి

ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ రైల్వేస్టేషన్ కు సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 23 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సీఎస్ఎంటీ ప్లాట్‌ఫాం 1కు వెళ్లే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ముంబై పోలీసులు సూచనలు జారీచేశారు.

మరింత +
'Will Honour Fishermen With Dedicated Ministry': Rahul Gandhi

మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు

దేశవ్యాప్తంగా మత్స్యకారులందరికీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభవార్త చెప్పారు. ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీలా తాను మోసపూరిత హామీలు ఇవ్వబోనని రాహుల్ స్పష్టం చేశారు. కేరళలోని త్రిస్సూర్‌లో ఇవాళ అఖిల భారత మత్స్యకారుల మహాసభ నిర్వహించిన జాతీయ మత్స్యకార ప్రతినిధుల సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. 2019లో తాము అధికారంలోకి వస్తే అందరికి కనీస ఆదాయన్ని కల్పిస్తామని రాహుల్ స్పష్టం చేశారు.

మరింత +
Bollywood responds to PM Modi’s voting appeal

ప్రతి భారతీయుడు ఓటు హక్కు వినియోగించుకోండి

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి భారతీయుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలకు ట్విట్టర్ ద్వారా అభ్యర్థించారు. అందుకు బాలీవుడ్ తారాగణం మోడీతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఓటు హక్కుపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేలా చూడాలని రాజకీయ, సినీ, క్రీడా, ప్రముఖులకు మోదీ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేసీఆర్‌, చంద్రబాబు సహా ట్విటర్‌ వేదికగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా అభ్యర్థించారు. ప్రజాస్వామ్య దేశంలో మీడియా సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల ఆలోచనలపై మీడియా పెను ప్రభావం చూపుతోందని, అలాంటి మీడియా సంస్థలు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం కల్పించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

మరింత +